Loading...

11, ఫిబ్రవరి 2010, గురువారం

జానపదసాహిత్యము~~రామరాజు గారి శోధన

జానపదసాహిత్యము~~రామరాజు గారి శోధన(చివరాఖరికి బల్బ్ వెలిగింది!! పాత ఎడిటర్ కు మారిపోయాను. ఇప్పుడు టపా వేయగలిగాను.)

లక్ష్మి~ గౌరీదేవి నీ శంభుని గళమున నలుపేమిటే ఓయమ్మా~నలుపేమిటే ఓయమ్మా
పార్వతి~ నారీమణినీ విష్ణుదేవుడు నలుపు గాదటే కొమ్మా~నలుపు గాదటే కొమ్మా
లక్ష్మి~ బిరుదు లేక నీ కాంతుడు జగములో భిక్షమెత్తుటే మమ్మా~భిక్షమెత్తుటే మమ్మా
పార్వతి~ బలము లేకను బలి చక్రవర్తిని అడుగ లేదటే కొమ్మా~అడుగ లేదటే కొమ్మా
లక్ష్మి~ శంక లేకను శంకరుకరమున జింక యుండుటే మమ్మా~జింక యుండుటే మమ్మా
పార్వతి~ శంకలేక వనవాసము కేగుట జింక కొరకు సుమి కొమ్మా~జింక కొరకు సుమి కొమ్మా

బి. రామరాజు గారు సంకలనం చేసిన ఒక పుస్తకం చదివానీమధ్య. అందులో మిత్రభేదము( చిన్నయసూరి), నయాగరా గురించి కురుమెళ్ళ వెంకటరావు గారి లేఖాసాహిత్యము మొదలగునవి ఉన్నవి. చివరగా జానపద సాహిత్యముగురించి ఒక వ్యాసము ఉన్నది.
కావ్యాలు చదవలేని పామరులకు కావ్యాల పట్ల మక్కువ కలిగించడము, చమత్కార ధోరణితో వినోదాన్ని కలిగించడము, చదువుకున్న వాళ్ళమనే పేరే గాని కావ్యములపై సరైన అవగాహన ఏర్పరచుకోగలిగే విద్వత్తు లేని నాలాంటి వాళ్ళకు ఎంతో మనోరంజకమైన జానపద సాహిత్యాన్ని ఎంతో శ్రమకోర్చి అధ్యయనం చేసి వాటికి లిఖితరూపాన్నిచ్చిన వారికి మనమెంతైనా ఋణపడి ఉండాలి.
కొంతమందికి ఇందులో ఉన్న హాస్యము నచ్చకపోవచ్చు. కానీ ఇప్పటి సినిమాల్లో కానవచ్చే హాస్యపు సన్నివేశముల గోలకన్నా జానపద గీతాలు ఎంతో బావుంటాయి.
బలి అవబోయే ఒక మేక ఎంత అమాయకంగా ఆలోచిస్తోందో చూడండి ఈ పాటలో!
మందలా శాలోల్లు మాట్లాడంగ
చూడవచ్చీరాని తా మురిసె మాకే
దోసిట్లో రూపాయలు~ గొంగట్ల బొయ్యంగ
వరదచ్చినని తా మురిసె మాకే
మెడకు తాడు బెట్టి గొరగొర గుంజంగ
కంటె బెట్టిరని తా మురిసె మాకే
గొరగొర గుంజుకొచ్చి పందిట్ల గట్టేస్తే
పెండ్లిపందిరని తా మురిసె మాకే
అచ్చిపోయేటోల్లు అటీటు నడువంగ
చూడవచ్చిరనితా మురిసె మాకే
కాళ్ళు సేతులు బట్టి కంట్లంబుగొయ్యంగ
కైలాసపురమనితా మురిసె మాకే
............
ఇలాగే సాగుతుంది. మేక మూర్ఖత్వాన్ని వర్ణించటంలో హాస్యం పండింది. మేక పట్ల జాలి కలిగేలా ప్రభావితం చేస్తుంది.
ఇలాంటి గీతాల్లో వదిన మరదళ్ళ హాస్యాలు, లాలిపాటలు, భగవంతుని పాటలు, అప్పగింతల పాటలు, నీతి నియమాలు బోధించే పాటలు ఎన్నో ఉన్నాయని తెలుస్తోంది.
ఇలాంటి పాటలు జనాల నోట్లోంచి ఆశువుగా ఎలా వచ్చేవి? ఎలాగంటే వాళ్ళు చుట్టూ వున్న ప్రకృతిని, తమ తోటి వారిని, వారి జీవన గమనాన్ని పరిశీలిస్తూ, కలిసి మెలిసి జీవిస్తూ ఉండటం వల్ల అని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఇప్పుడు అలాంటి జీవనమూ లేదు. బ్రతుకులో జీవమూ లేదు.
నాకిప్పుడు ఎక్కడో విన్న ఈ గంగమ్మ పాట గుర్తుకొస్తోంది.
శివునీ శిరసూ పైన వెలసిన గంగా!
విష్ణువు పాదాన వెలసిన గంగా!
గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగా!
భగీరథుని ముద్దు పాపవే గంగా!
సాగరునికెంతో ప్రియమైన గంగా!
జీవుల కెంతో ముఖ్య ప్రాణమైన గంగా!
ఓషధులు దాచినా వయ్యారి గంగా!
రామరాజుగారు..
ఉస్మానియా విశ్వ విద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులుగా ,.జాతీయ సాహిత్య పరిషత్ సంస్థాపక అధ్యక్షులుగాపనిచేసినారు జానపద సాహిత్య భాండాగారాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన వారు.ఈ నెల ఎనిమిదవ తేదీన కాలం చేశారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి