Loading...

9, డిసెంబర్ 2009, బుధవారం

గుండె ముక్కలైంది

ప్రియమైన ఆంధ్ర ప్రదేశ్ చెక్కలైంది. మాతెలుగు తల్లికీ మల్లెపూదండ పాడి పెరిగిన మనసు ముక్కలైంది. మన ఐకమత్యం చూసి ప్రపంచం నవ్వుతోంది.
రుద్రమ దేవి, రామప్ప దేవాలయం ఇక పక్కరాష్ట్రానికి చెందినవా?
ఆంధ్ర అంటే రాయలసీమ, తెలంగాణా, కోస్తా కాదా? ఇంకా ఎన్ని ముక్కలు కానుందో?

7, డిసెంబర్ 2009, సోమవారం

చదువుకున్న వాళ్ళు...

చదువుకున్న వాళ్ళు...

మన తెలుగులో కన్నా తమిళ్ సినిమాల్లో కానీ, సీరియల్స్ లో కానీ, బయటిప్రపంచంలో కానీ "పడిచ్చవర్" అని ప్రత్యేకంగా చెప్తుంటారు చదువుకున్న వాళ్ళని. అది ఎంత మూర్ఖంగా ఉంటుందంటే కుటుంబ సభ్యుల్లో కూడా చదువుకున్న వాళ్ళు చెప్పింది సబబా కాదా అని అలోచించకుండా సమర్థిస్తుంటారు!

అదేమిటి, చదువుకున్నంత మాత్రాన వివేకం, విచక్షణా జ్ఞానం వచ్చేస్తాయా ఏంటి? చదువుకోనంత మాత్రాన అనుభవంతో, లోకజ్ఞానంతో అవి రావా ఏంటి?

మంచి, చెడు తెలీడానికి మనం చదువుకునే ఇంగ్లీషులు, ఫిజిక్స్ లూ ఎలా పనికొస్తాయి. అవి పనికిరాని చదువులు అని నా ఉద్దేశ్యం కాదు. వాటితో మనం ఎన్నో సాధించవచ్చు. కానీ

* సాధారణ జీవితానికీ,
* సమాజంలో మనం ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోడానికీ,
* ఇంటినీ, కుటుంబాన్నీ చక్కదిద్దుకోవటానికీ,
* పిల్లలను పెంచి పెద్ద చేయడానికీ (సక్రమంగా),
* భవిష్యత్తును రూపొందించుకోవటానికీ
* బాధ్యతగా నడచుకోవడం తెలియడానికీ
* అన్నింటికన్న ముఖ్యంగా ప్రేమానురాగాలు పంచటానికీ

ఈ విషయాలు తెలియాలంటే మనం లండన్ బ్రిడ్జ్ పడిపోయిన విషయాన్నో, బల్బ్ ఎలా తయారు చేశారన్న విషయాన్నో, రష్యా రాజ్యాంగాన్నో, జావా ప్రోగ్రామింగ్ నో తెలుసుకుంటే చాలదు. ఇవన్నీ మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికీ, మనకూ నాలుగు విషయాలు తెలుసన్న ఈగోని పెంచుకోవడానికీ పనికొస్తాయి.

కానీ జీవితంలొ ప్రతి ఒక్కరికీ ఏదొ ఒక దశలో జీవితంటే డబ్బునీ, ఈగోనీ సంపాదించడం మాత్రమే కాదని
పదిమంది మనసులో తన పట్ల నిజమైన గౌరవం సంపాదించడం అనీ తెలుస్తుంది. కానీ అప్పటికప్పుడు మారడం సాధ్యం కాదు. అందుకని మారినట్టు నటించడం ప్రారంభిస్తారు.

నిజానికి చదువుకున్న వాళ్ళని గౌరవించడం పూర్వకాలం నించీ ఉంది. అయితే అప్పటి చదువులో నిజంగానే మంచీ, చెడూ తెలుసుకునే అవకాశం ఉండేది. ఇది ఎవరూ కాదనలేని సత్యం.

* మనలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది అని చెప్పటం ద్వారా ఎవరినీ ఎక్కువ తక్కువ చేసి చూడకూడదని చెప్పారు.
* సర్వే జనా: సుఖినో భవంతు అని జాతి మత లింగ భేదం లేకుండా అందరి క్షేమాన్ని కాంక్షించడం ద్వారా ఎవరినీ ద్వేషించకూడదని నేర్పారు.
* ఆబ్రహ్మ కీట జననీ అని శక్తి స్వరూపిణిని కీర్తించడం ద్వారా అందరూ సోదర సమానులే అని నొక్కి చెప్పారు.

అంతేకాక తప్పులు చేయడం, సరిగా ప్రవర్తించడం వలన కలిగే ఫలితాలేంటో సోదాహరణంగా ఇతిహాస పురాణాల ద్వారా చదువుకున్నప్పుడు మంచీ చెడు విచక్షణ దానంతటదే కలుగుతుంది.

కొన్ని కాలానుగుణంగా మారవచ్చు. కొన్ని కాలాతీత విషయాలుంటాయి. అవి మనకెప్పుడూ పనికొస్తాయి.
తప్పొప్పుల గురించీ, ఫలితాల గురించీ అనుభవాల పాఠాల ద్వారా తెలుసుకోవడం జరిగేది కనుక పూర్వం చదువుకున్న వాళ్ళకూ, చదువులేని వాళ్ళకూ తేడా ఉండేదేమో జీవిత నౌకాయానంలో.

కానీ ఇప్పటి చదువుల్లో విజ్ఞానం పెరుగుతుందేమో కానీ, లోకజ్ఞానం పెరగదు.
ఈ విషయాలు తెలీక నేనూ ఒకప్పుడు ఒకటీ, రెండూ విషయాల్లో నా మిడిమిడి జ్ఞానంతో అనుభవజ్ఞుల్ని మా నాన్నమ్మని వ్యతిరేకించాను. ఇప్పుడు చింతిస్తున్నాను.