Loading...

31, జనవరి 2009, శనివారం

రాధికా విరహ గీతి


జయదేవుని రాధిక విరహ ఘట్టం చదువుతుండగా
నా మనసులో రాధ గురించి ఎన్నో ఆలోచనలు. వాటినన్నింటిని కాగితం మీద పెట్టకుండా ఉండలేకపోయాను. అది ఈ గీతమై నిలిచింది. ఇప్పుడు అన్నిభావనాతరంగాలను పదిలంగా దాచుకునేందుకు బ్లాగు అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులో రాయకుండా (టైపకుండా) ఉండగలనా?

ఒంటరి మనసు తుంటరి తోడు కోరుకున్నదిలే !
చల్లని రేయి మల్లెల వేళ వేచి ఉన్నదిలే ! ||||

ఉరమున వాలే కోరిక తీర్చగ చేర రమ్మనెలే !
కరముల మాలలు వాడక మునుపే వేగ రమ్మనెలే!
వెన్నెల లోన ఉల్లమునందున
ఆశలున్నవిలే ! ||||

కన్నుల కన్నీరొలికే దాకా జాగు చేయకుమా!
వెన్నల మనసుల మీద కొంచెం జాలి చూపుమా!
నిన్నే నమ్మిన నెచ్చెలి నొకపరి
చెంత చేర్చుమా! ||||

ఎల్లలు లేని ఆకస వీధుల సంచరించెదమా!
కలువల తోటల కాసారమ్ముల సాగిపోదామా!
నవ్వుల పువ్వులు విరిసే చోటికి
చేరుకుందామా! ||||
-మందాకిని(లక్ష్మీదేవి)

29, జనవరి 2009, గురువారం

చిన్న నాటి కబుర్లు

మా తమ్ముడు చక్కగా కష్టపడి చదివేవాడు. హార్డ్ వర్కర్ అన్నమాట. నాకేమో ఒకసారి చదివింది మళ్లీ మళ్లీ చదవాలంటే బోరు. (ఏక సంథా గ్రాహి అని పేరుండేది లెండి మనకి) దానికి తగినట్టు వాడు ఎప్పుడూ క్లాసులో ఫస్టు వచ్చేవాడు. వాడు

పదవ తరగతి పరిక్షలు రాసినప్పుడు జరిగిన విషయము మేమెప్పుడూ మరిచిపోలేము.
మాది పల్లె కావటం వల్ల పరిక్షలు మా పాఠశాల లో కాకుండా పక్కన ఉన్న టౌను లో వేశారు. రోజు వెళ్లి వచ్చేవాడు. వాళ్ల బాచ్ కు (సబ్జెక్టు లన్నీ)సిలబస్ మారింది. కొత్త సిలబస్ తో ఉపాధ్యాయులతో సహా అందరూ కష్ట పడుతున్నారు.

ఒకరోజు ఆంగ్ల పరిక్షరోజు అనుకుంటా, మా తమ్ముడు పరిక్ష రాయడం మొదలెట్టాడు. అందరూ మొదలెట్టారు. కాని పేపర్ చాలా కష్టంగా ఉంది కాబోలు ఎవ్వరూ సరిగా రాయలేక పోతున్నారు. అప్పుడు పరిక్షాదికారి టక టకా రాసేస్తున్న మా తమ్ముడి దగ్గరకు వచ్చి గమనిస్తున్నాడట.

రెండు గంటలు గడిచాయి. మా తమ్ముడు చాలావరకూ రాసేశాడు. అప్పుడు ఉన్నట్టుండి పరిక్షాదికారి మా తమ్ముడి పేపర్ తీసుకుని పెద్దగా చదివి అందరికి డిక్టేట్ చెయ్యడం మొదలెట్టాడుట. మా తమ్ముడు షాక్! కాని చేసేదేమీ లేక రాసినవన్నీ చూపిస్తూ వచ్చాడట. ఇంటికి వచ్చాక మాతో విషయం చెప్పాడు. నాకో కొత్త భయం పట్టుకుంది పేపర్లన్నీ ఒకేలా ఉంటే డిబార్ చేస్తారేమో, అన్దరినీ డిబార్ చేస్తే..? వీడిదే ఒరిజినల్ అని వారికి ఎలా తెలుస్తుంది?
ఆతర్వాత కూడా కష్టమైన పేపర్లన్నిటికి ఇదే వరస.

ఇప్పుడు అయితే ఇన్ని టీవీలు అవి వచ్చాయి కాని అప్పుడేముంది? అన్యాయం జరిగితే వెంటనే అదే వార్త పదే పదే వేసి లోకమంతా తెలిసిపోతుంది. కొందరికి పరిష్కారం దొరకొచ్చు. కొందరికి దొరక్కపోవచ్చు. కాని పబ్లిక్ కి విషయం తెలుస్తుంది. దాదాపు ఇరవైయేళ్ళ క్రితం ఏమి లేదు. రిజల్ట్స్ వచ్చేవరకూ మనసు మనసులో లేదు.

ఎట్టకేలకు రిజల్ట్స్ వచ్చాయి. మా తమ్ముడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. మిగతా వాళ్లు డిబార్ కాలేదు. అంతే కాదు, అంత వరకూ స్కూల్ చరిత్రలో లేని విధంగా మాతమ్ముడు మార్కులు తెచ్చుకున్నాడు.

కరస్పండేంట్ గారు పిలిచి నువ్వు మన వూరికే పేరు తెస్తావని ఆశీర్వదిన్చారు. ఇప్పుడు వాడు టి. సి. ఎస్ లో ఉన్నాడు. విధంగా పరిక్షలు నిర్వహించే వాళ్ళే నడచుకుంటే ఎవ్వరేం చెయ్యగలరు? కొత్త సిలబస్ కు తగినట్టు గా ఉపాధ్యాయులకు శిక్షణ నిచ్చి తయారు చెయ్యాలి. కంచె చేను మేస్తే అన్నట్టు ఇలా జరిగితే అడ్డుకునేది ఎవరు?

అయినా మార్కులు, పాస్ కావడం కాకుండా విషయం అర్థమయిందా లేదా అని చూసే రోజు ఎన్నడు వస్తుందో? పూర్వం మన గురుకులాల్లో అలాగే ఉండేదిట. ఎన్ని రోజులు అని కాకుండా ఒక సబ్జెక్ట్ , లేదా శాస్త్రం అని తీసుకుంటే అది అంత అవపోసన పట్టేవాళ్ళు. తిరిగి అలాంటి రోజులు రావాలని నా ఆశ. అప్పుడే శాస్త్రం లో మనం మరింత నేర్చుకుని , పరిశోధించి ఏమైనా కనిపెట్టగలం. శాస్త్రజ్ఞులు పెరుగుతారు.

అలా కాకుండా పది పదిహేనేళ్ళు పది రకాల సబ్జెక్టులని పరిచయం అనే పేరు తో అలవాటు చేసి ఇప్పుడు నీకేది కావాలో తేల్చు కొమనడం సబబు కాదు. అప్పుడు వాళ్లు తేల్చుకోలేక పోవడమూ వింత కాదు.

కొంతమంది పిల్లలు మాకు ఇది కావాలని చెప్పగలరేమో గాని అందరూ చెప్పగలరా? అప్పుడే స్నేహితులు, బంధువులు చెప్పిన తెలిసి తెలియని ఉచిత సలహాలు ఇవ్వటం మొదలెడితే వాటిల్లో ఏదో ఒకటి పాటించి, తర్వాత కయ్యో మొర్రో మంటే ఏంటి లాభం?

26, జనవరి 2009, సోమవారం

నేటి సమాజం.. ఏం కోల్పోతూంది ?

మనం ఎప్పుడూపిల్లలు బాల్యం కోల్పోతున్నారని మాట్లాడుకుంటూ ఉంటాము. నిజమే, పిల్లలు వీడియో, టీవీ ,కంప్యూటర్ గేమ్స్ , చదువులు అని ఎప్పుడూ బిజీ గా ఉంటారని, నేలమీద, మట్టిలో ఆడుకోవడానికి లేదని, బాధపడుతూ ఉంటాము. అంతేనా, ఏదైనా బంధువులందరూ కలిసే శుభ సందర్భాలు, పండుగలు మొదలైన వాటిలో అందరితో కలిసే అవకాశము ఉండదు. ఈ విధంగా అలవాటు లేక ఎప్పుడైనా అందరితో కలిసినప్పుడు వారితో కలుపుగోలుగా ఉండలేకపోతారు. కాబట్టి కలవడానికి అసలు ఇష్టపడటమే లేకుండా పోతుంది.

రాను రాను నాలాంటి అమ్మలు కూడా బ్లాగులకు అలవాటు పడి, పిల్లలతో కలిసి గడిపే టైము తగ్గిపోతూంది. ఈ విధంగా పిల్లలు వాళ్ల లోకంలో వాళ్లు ఉండటానికి ఒక తప్పనిసరి పరిస్థితికి నెట్టబడుతున్నారు.
ఉరికే ఉండటం , ఇతరులతో కలిసి గడపడం లాంటివి ఈ తరానికి చేత కావేమో గదా!

నాకు తెలుసు.ఇంతకి, నేను చెప్పోచ్చేదేమిటి అంటే
పిల్లలు ఎలా బాల్యం కోల్పోయారో, అలాగే పెద్దలు తమ వృద్ధాప్యాన్ని కోల్పోయారని నాకు అనిపిస్తోంది. నిజమే , వృద్ధాప్యాన్ని అందులోని పెద్దరికపు గౌరవాన్ని, అందులోని హుందాతనాన్ని కోల్పోయారు. మునుపట్లో, ఇంటిలో పెద్దలు ఉంటే, ప్రతీ ముఖ్య విషయంలో, వారిని సంప్రదించి, వారి సలహా తీసుకుని, అమలు చేసేవారు.

వారి అనుభవము,
వారి మేచ్యురిటి(పరిపక్వత)
తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించడము
తమ ఒక్కరికే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని గురించి ఆలోచించి, నిర్ణయం తీసుకొగలగడము,
లోకజ్ఞానము

ఇవన్ని ఉపయోగించుకోకుండా ఈ నాటి (యువతరమా, కాదు) సంపాదించే వారు, వారి జీవిత భాగస్వామి ఎంతో కోల్పోతున్నారనిపిస్తోంది. ఒక్కమాట నేను ఒప్పుకోక తప్పదు. ఈ నాడు లభించే సదుపాయాలు, సౌకర్యాల గురించి పెద్దవాళ్ళకు తెలీక పోవచ్చు. కాని పైన చెప్పినవన్నీ వారి ప్లస్ లే కదా. ఎ విషయమైనా రెండు తరాలవారు కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకోవచ్చు కదా. ఇంకా నయం, ఇప్పుడు కొత్తగా పెళ్ళయిన వాళ్ళయితే పిల్లలను కనగానే మా పిల్లలు మా ఇష్టం అనడం చూస్తూంటాం. చిన్న పిల్లల విషయం అనుభవజ్ఞులకే కదా బాగా తెలుస్తూంది అని కూడా అనుకోరు. ఇక పెద్ద పెద్ద విషయాలు, పాలసీ డేసిషన్స్ తీసుకునే టప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించాలి అనుకుంటారా?
ఈ విధంగా ప్రతీ విషయంలోనూ నిర్లక్ష్యం చేయబడటం వల్ల పెద్దవారికి జీవితం మిద ఇచ్ఛ తగ్గిపోతూంది. ఇప్పుడు వచ్చిన వైద్య సౌకర్యాల వల్ల వారి ఆరోగ్యాలు బాగుగా ఉండటము, జీవిత కాలము పెరగడము జరగడం మంచిదే అయినా కుటుంబంలో వారి పాత్ర, బాధ్యత గణనీయమ్ గా తగ్గిపోయింది. దీంతో వారు సొంత ఇంట్లో అతిథులుగా ఉండవలసి వస్తోంది. ఎంత సౌకర్యంగా ఉన్నా అతిథులుగా ఎక్కువ రోజులు గడపడం చాల కష్టం. ఇది అన్దరికీ అర్థం కాకపోవచ్చు. కొన్నేళ్ళ క్రితం మనవాళ్ళని చూసుకోవడం అనే సంతోషకరమైన బాధ్యత అయినా ఉండేది. ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ అని కోచింగ్ లని చాల బిజీ గా ఉండటం తో అదీ పోయింది. అందుకే కుటుంబాల్లో పెద్దల పరిస్థితి చుస్తే చాల జాలేస్తుంది
ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికే చాలామంది పదవీ విరమణ తర్వాత కూడా పిల్లలు పనిచేసే ఊరికి షిఫ్ట్ కావడానికి ఇష్ట పడరు. ఒంట్లో ఓపిక అనేది ఉన్నంతవరకూ భార్య భర్తలే ఒంటరిగా ఉంటారు. ఎంత ఓపిక అని చెప్పుకున్న అన్ని పనులు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. చప్పున ఒక మాత్ర తెచ్చుకోవాలన్న, ఒక కాఫీ చేసుకోవాలన్న ఒక్కోసారి కష్టంగానే ఉంటుంది.
ఏమిటో ఈ జీవితం అని అనిపించక మానదు.

అందుకే నేటి సమాజం బాల్యం యొక్క అందాన్ని, ఆనందాన్ని కోల్పోయిందో అదే విధంగా వృద్ధాప్యం యొక్క హుందాతనాన్ని, పరిపక్వతని కోల్పోయింది. దీనికీ కాలమే జవాబు చెప్పాలి. ఎందుకంటే అందరికి తమ తమ కారణాలు ఉండటం వల్ల వీరిది తప్పే అని నొక్కి చెప్పలేము.