Loading...

17, జులై 2009, శుక్రవారం

ముగింపు ఎప్పుడు?

ఈ వారం మా వీధిలో కొత్తగా 3 బోర్లు వేశారు. కొత్త ఇళ్ళు కాదు. ముందు నుంచీ ఉన్నవాళ్ళే. మొదటే మా బోరులో నీళ్ళు లేక ప్రతిరోజూ ఓ సమయంలో అన్ని ఫ్లాట్ లవాళ్ళూ పట్టుకుంటున్నం అలా నిలవ చేసుకుని వాడుకుంటున్నాము. ఇక ఈ చొప్పున బోర్లు వేస్తే ఏముంది ఆ 15 నిముషాల నీళ్ళు అయినా వస్తాయా అని భయంగా ఉంది. కార్పొరేషన్ వాడు వదిలే నీళ్ళ మీదే ఆధార పడుతోందిప్పుడు ఓవర్ హెడ్ టాంక్.


బోరు మోటారు కొత్తది ఎక్కువ పవర్ ఉండేది వేయాలని మెకానిక్ చెప్పాడు. కాని ఫ్లాట్లో ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోరు. అప్పటికీ లోకం పోకడ చూసి తెలుసుకున్నదేమిటంటే మా ఫ్లాట్ ఎంతో మేలని ఏకాభిప్రాయం మీద నడుస్తోందనీ. బాధ్యతలు - గేటు తాళం నుంచీ మోటారు వేసే వరకూ అందరం చూసుకుంటాం. ఎక్కువ ఫ్లాట్స్ లేకపోవటం వల్ల సెక్రెటరీ, హంగామా లేదు. అవసరమైనప్పుడు అంతా కలిసి మీటింగ్ పెట్టటమే.


పోయిన టపాలో మా వూరిలో, మా ఇంటిలో ఉన్న బావి గురించి రాసినప్పుడే ఇక్కడి, ఇప్పటి పరిస్థితి గురించి బాధపడ్డాను ఇది రాయటానికి టైం ఇప్పుడు కుదిరింది.
అప్పుడు నిళ్ళు మోసేది ఎవరు అని వంతులు వేసుకోవడమే గాని, నీళ్ళు సమస్య కాదు. ఇప్పుడు నీళ్ళే సమస్య!!!! మోసే పని మోటర్లు తీసుకున్నాయి కానీ నీళ్ళే లేనప్పుడు మోటరేంచేస్తుంది?
ఒకటీ రెండు సార్లు లారీ తెప్పించాము. కొన్ని చోట్ల నెలసరి లారీ తెప్పిస్తారని విన్నాను. ఆ విధంగా వ్యాపారం పెట్టి భూమిని తోడేస్తే ఇంకా నీళ్ళేం ఉంటాయి?

మంచినీళ్ళ బావి కధలో లా ఏ బావులైనా ఎండిపోతాయిగా!


అసలు ఈ చిక్కంతా ఎందుకొచ్చింది? కేవలం జనాభా పెరగడం వల్లేనా? మనలాంటి వాళ్ళందరూ ఉన్న వూరునీ, కన్నవాళ్ళనీ వదిలి పెద్ద ఉద్యోగాలు చేయాలి సుఖపడి పోవాలని అనుకోబట్టి కూడా కదా! ఎక్కడి వాళ్ళక్కడే గప్ చుప్ అన్నట్టు అక్కడే ఉండిపోతే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. మన వృత్తులు మనం చేసుకుంటూ ఉన్న దాంట్లో తృప్తి పడి ఉంటే -- ఇక్కడ ఏ ఒక్కరినో చెప్పడం కాదు. ఊరు వదలటం, సంపాదించాలని పెద్ద ఫాక్టరీలు, పెట్టి కాలుష్యాన్నీ, కన్స్యూమరిజాన్ని పెంచటం, ఒక్క కుటుంబంలో వాళ్ళు ప్రైవసీ అంటూ వేరుకాపురాలు పెట్టి లెక్కకు మిక్కిలి ఇళ్ళ నిర్మాణం,(దానికి నీళ్ళు మళ్ళీ). మా పక్క వీధిలో 4 ఫ్లాట్స్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒకరి స్థలంలో కట్టి అందులో 2 బోర్లు, 2 ఒవర్ హెడ్ టాంక్స్. స్థలం ఒనర్ కు ఆ ఇల్లు ఉంచుకుని ఫ్లాట్స్ అమ్మేశాడు. లీగల్గా తప్పేం లేదు.


పైన ఉన్న విషయాలన్ని లీగల్గా తప్పు కాదు. కానీ రోజులు గడిచేకొద్దీ మనకే సమస్యలొస్తున్నాయి. ఎవరు ఎవరికి చెప్పేవాళ్ళు?
దీనికంతా ముగింపు ఎప్పుడు?

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి