Loading...

26, జనవరి 2009, సోమవారం

నేటి సమాజం.. ఏం కోల్పోతూంది ?

మనం ఎప్పుడూపిల్లలు బాల్యం కోల్పోతున్నారని మాట్లాడుకుంటూ ఉంటాము. నిజమే, పిల్లలు వీడియో, టీవీ ,కంప్యూటర్ గేమ్స్ , చదువులు అని ఎప్పుడూ బిజీ గా ఉంటారని, నేలమీద, మట్టిలో ఆడుకోవడానికి లేదని, బాధపడుతూ ఉంటాము. అంతేనా, ఏదైనా బంధువులందరూ కలిసే శుభ సందర్భాలు, పండుగలు మొదలైన వాటిలో అందరితో కలిసే అవకాశము ఉండదు. ఈ విధంగా అలవాటు లేక ఎప్పుడైనా అందరితో కలిసినప్పుడు వారితో కలుపుగోలుగా ఉండలేకపోతారు. కాబట్టి కలవడానికి అసలు ఇష్టపడటమే లేకుండా పోతుంది.

రాను రాను నాలాంటి అమ్మలు కూడా బ్లాగులకు అలవాటు పడి, పిల్లలతో కలిసి గడిపే టైము తగ్గిపోతూంది. ఈ విధంగా పిల్లలు వాళ్ల లోకంలో వాళ్లు ఉండటానికి ఒక తప్పనిసరి పరిస్థితికి నెట్టబడుతున్నారు.
ఉరికే ఉండటం , ఇతరులతో కలిసి గడపడం లాంటివి ఈ తరానికి చేత కావేమో గదా!

నాకు తెలుసు.ఇంతకి, నేను చెప్పోచ్చేదేమిటి అంటే
పిల్లలు ఎలా బాల్యం కోల్పోయారో, అలాగే పెద్దలు తమ వృద్ధాప్యాన్ని కోల్పోయారని నాకు అనిపిస్తోంది. నిజమే , వృద్ధాప్యాన్ని అందులోని పెద్దరికపు గౌరవాన్ని, అందులోని హుందాతనాన్ని కోల్పోయారు. మునుపట్లో, ఇంటిలో పెద్దలు ఉంటే, ప్రతీ ముఖ్య విషయంలో, వారిని సంప్రదించి, వారి సలహా తీసుకుని, అమలు చేసేవారు.

వారి అనుభవము,
వారి మేచ్యురిటి(పరిపక్వత)
తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించడము
తమ ఒక్కరికే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని గురించి ఆలోచించి, నిర్ణయం తీసుకొగలగడము,
లోకజ్ఞానము

ఇవన్ని ఉపయోగించుకోకుండా ఈ నాటి (యువతరమా, కాదు) సంపాదించే వారు, వారి జీవిత భాగస్వామి ఎంతో కోల్పోతున్నారనిపిస్తోంది. ఒక్కమాట నేను ఒప్పుకోక తప్పదు. ఈ నాడు లభించే సదుపాయాలు, సౌకర్యాల గురించి పెద్దవాళ్ళకు తెలీక పోవచ్చు. కాని పైన చెప్పినవన్నీ వారి ప్లస్ లే కదా. ఎ విషయమైనా రెండు తరాలవారు కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకోవచ్చు కదా. ఇంకా నయం, ఇప్పుడు కొత్తగా పెళ్ళయిన వాళ్ళయితే పిల్లలను కనగానే మా పిల్లలు మా ఇష్టం అనడం చూస్తూంటాం. చిన్న పిల్లల విషయం అనుభవజ్ఞులకే కదా బాగా తెలుస్తూంది అని కూడా అనుకోరు. ఇక పెద్ద పెద్ద విషయాలు, పాలసీ డేసిషన్స్ తీసుకునే టప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించాలి అనుకుంటారా?
ఈ విధంగా ప్రతీ విషయంలోనూ నిర్లక్ష్యం చేయబడటం వల్ల పెద్దవారికి జీవితం మిద ఇచ్ఛ తగ్గిపోతూంది. ఇప్పుడు వచ్చిన వైద్య సౌకర్యాల వల్ల వారి ఆరోగ్యాలు బాగుగా ఉండటము, జీవిత కాలము పెరగడము జరగడం మంచిదే అయినా కుటుంబంలో వారి పాత్ర, బాధ్యత గణనీయమ్ గా తగ్గిపోయింది. దీంతో వారు సొంత ఇంట్లో అతిథులుగా ఉండవలసి వస్తోంది. ఎంత సౌకర్యంగా ఉన్నా అతిథులుగా ఎక్కువ రోజులు గడపడం చాల కష్టం. ఇది అన్దరికీ అర్థం కాకపోవచ్చు. కొన్నేళ్ళ క్రితం మనవాళ్ళని చూసుకోవడం అనే సంతోషకరమైన బాధ్యత అయినా ఉండేది. ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ అని కోచింగ్ లని చాల బిజీ గా ఉండటం తో అదీ పోయింది. అందుకే కుటుంబాల్లో పెద్దల పరిస్థితి చుస్తే చాల జాలేస్తుంది
ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికే చాలామంది పదవీ విరమణ తర్వాత కూడా పిల్లలు పనిచేసే ఊరికి షిఫ్ట్ కావడానికి ఇష్ట పడరు. ఒంట్లో ఓపిక అనేది ఉన్నంతవరకూ భార్య భర్తలే ఒంటరిగా ఉంటారు. ఎంత ఓపిక అని చెప్పుకున్న అన్ని పనులు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. చప్పున ఒక మాత్ర తెచ్చుకోవాలన్న, ఒక కాఫీ చేసుకోవాలన్న ఒక్కోసారి కష్టంగానే ఉంటుంది.
ఏమిటో ఈ జీవితం అని అనిపించక మానదు.

అందుకే నేటి సమాజం బాల్యం యొక్క అందాన్ని, ఆనందాన్ని కోల్పోయిందో అదే విధంగా వృద్ధాప్యం యొక్క హుందాతనాన్ని, పరిపక్వతని కోల్పోయింది. దీనికీ కాలమే జవాబు చెప్పాలి. ఎందుకంటే అందరికి తమ తమ కారణాలు ఉండటం వల్ల వీరిది తప్పే అని నొక్కి చెప్పలేము.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి